
- 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ
- విద్య, ఎలక్ర్టానిక్స్, ఔషధం, పర్యాటకం
- నాలుగు జోన్లుగా కొత్త నగర విభజన
- 5 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు
- వెయ్యి ఎకరాల్లో ఎలక్ర్టానిక్ సిటీ
- కొత్తగా వచ్చే ఫాక్స్‌కాన్ అందులోనే
- వెయ్యి ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్క్
- 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు!
- రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా అభివృద్ధి చేయనున్న ‘ఫ్యూచర్ సిటీ’ న్యూయార్క్‌ను తలదన్నేలా ఉంటుందని, మౌలిక వసతులు చూసి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు బారులు కడతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన కలల్ని నిజం చేసే దిశగా 50 వేల ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో నగర నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రణాళిక సిద్ధమవుతోంది. సేకరించిన భూమిని నాలుగు జోన్లుగా విభజిస్తారు. ఇందులో విద్య, ఎలక్ర్టానిక్స్, ఔషధ పరిశోధన, పర్యావరణ పర్యాటకం జోన్లు ఉంటాయి. ఒక్కో జోన్ 3-4 వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, ఏకో టూరిజంతో పాటు అన్ని వసతులు నవ నగరంలో ఏర్పాటు కానున్నాయి. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఫార్మా ఉత్పత్తుల తయారీ కాకుండా కేవలం ఫార్మా పరిశోధన కంపెనీలకే ఇక్కడ చోటిస్తున్నారు.
ముచ్చెర్ల ఫార్మా సిటీలో అవకాశం కోసం ఇప్పటికే 300 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో పరిశోధనలు చేసే కంపెనీలకు ఇక్కడ చోటిస్తారు. మిగతా కంపెనీలకు రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల ఏర్పాటు చేసే ఫార్మా విలేజ్ క్లస్టర్లలో అవకాశం ఇస్తారు. ఫ్యూచర్ సిటీలో మొత్తం రెండు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తారు. ఇటీవలే 150 ఎకరాల్లో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యా జోన్‌లో ఉంటుంది. ఫార్మా, క్రీడా యూనివర్సిటీలు ఇందులోనే ఉంటాయి. ఎలకా్ట్రనిక్ జోన్‌లో ఎలక్ర్టానిక్ కంపెనీలు వస్తాయి. తైవాన్ కేంద్రంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ర్టానిక్స్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కు కూడా ఇందులోనే చోటిస్తారు. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ ఛైర్మన్ ఢిల్లీలో భేటీ సందర్భంగా ఫోర్త్ సిటీలో పెట్టబడులు పెట్టాలని సీఎం కోరారు. ఎలకా్ట్రనిక్ సిటీలో భాగంగానే జపాన్ కంపెనీలకు ప్రత్యేకంగా ఓ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ-జపాన్ మధ్య పారిశ్రామిక బంధం గత కొన్నేళ్లలో బలోపేతం అయింది. ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
- పచ్చదనంతో పర్యాటకం
పర్యావరణానికీ పెద్దపీట వేయాలన్న లక్ష్యంగా ప్రత్యేకంగా ఏకో టూరిజం జోన్ ఏర్పాటు కానుంది. పచ్చదనంతో కూడిన రిసార్టులు ఏర్పాటుకు అనుమతిస్తారు. కందుకూరు వైపు ఇప్పటికే పచ్చదనం ఉండటంతో దీనిని కొనసాగిస్తూ ఎకో టూరిజం జోన్ ఏర్పాటు చేస్తారు. జూపార్క్ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. అదీ ఈ జోన్‌లోనే వస్తుంది. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు నివాస స్థలాలు ఇచ్చేందుకు 600 ఎకరాలు కేటాయించారు. ఇవీ పర్యాటక జోన్‌లోనే ఉంటాయి. ఆసుపత్రులు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు విశాలమైన రహదారులు, విమానాశ్రయం నుంచి మెట్రో అనుసంధానం.. అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నారు.
- భూములిచ్చిన వాళ్లకు ఉపాధి
నాలుగు జోన్లలో కలిపి రెండు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో లాగా కాకుండా ఇక్కడి పరిశ్రమల్లో అన్ని స్థాయిల్లో స్థానిక యువతకే ఉపాధి అవకాశాలు లభించేలా జాగ్రత్త పడనున్నారు. తక్కువ విద్యార్హతలు ఉన్నా నైపుణ్య శిక్షణ అందించి అక్కడే అవకాశం కల్పిస్తారు. ముచ్చర్ల బేగరికంచెతో పాటు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకుంటుందని, తమ స్థిరాస్తుల విలువ గణనీయంగా పెరుగుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- మెట్రో డీపీఆర్‌కు కసరత్తు!
సిటీ మెట్రోకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్(హెచ్‌ఏఎంల్) అధికారులను ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించారు. రెండో దశ మెట్రో డీపీఆర్‌ను ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు శంషాబాద్ నుంచి ముచ్చర్లలోని ఫ్యూచర్‌సిటీ వరకు నిర్మించనున్న 32 కిలోమీటర్ల డీపీఆర్‌ను కూడా తయారు చేసేందుకు ముందుకుసాగుతున్నారు. వచ్చే వారంలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రెండో దశ డీపీఆర్‌ను తయారుచేసిన సిస్ర్టా కన్సల్టెన్సీతోనే ఈ మార్గాన్ని అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. రెండో దశలో ప్రతిపాదించిన మైలార్‌దేవ్‌పల్లి-ఆరాంఘర్- న్యూహైకోర్టు (రాజేంద్రనగర్) పనులను శంషాబాద్ వరకు నేరుగా పొడిగించాలని, తర్వాత అక్కడి నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు కూడా మెట్రోను తీసుకెళ్లే విధంగా డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మార్గానికి సుమారు రూ.8 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.